బందనాలు ఆపలేని అల – రెడ్డి జాగృతి అసెంబ్లీ ముట్టడి :
డిసెంబర్ 27, 2016 సైలెంట్ గా తనపని తాను చేసుకుంటూ, తన కుటుంబం ఖర్చుల వరకు ఆలోచించి లెక్కలు రాసుకొని, పొదుపుతో బ్రతుకుతున్న రెడ్డి… ఇన్నాళ్లుగా తనలో దాచుకున్న వేదనను, తన వారికి అన్ని రంగాలలో జరుగుతున్న అన్యాయాలను గురించి, అట్టుడికి పోయిన అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగితే… ఇలాగే ఉంటుంది అని తెలిసొచ్చిన రోజు.
ఇందిరాపార్క్ వద్ద ఉదయం మొదలైన “జై రెడ్డి” నినాదాలు… ఆ రోజు వరకు మంత్రివర్యులను కలిసి వినతిపత్రాలు సమర్పించడం… సైలెంట్ గా వెళ్లి మళ్లీ తమ రోజువారి పనులలో నిమగ్నమయ్యే రెడ్డి బిడ్డలనే చూసిన అనుభవంతో ఉన్న అధికారాల మధ్య మన నినాదాలు చెవులకు సోకలేదు.
మద్యాహ్న సమయం వరకు నినాదాలు, ర్యాలీ వరకు మాత్రమే ప్రశాంతత చూసి, న్యూస్ పేపర్ కవరేజ్ కోసం చేసే ధర్నాలనే తక్కువ అంచనాల మధ్య… పోలీసుల పహారాలతో, ముళ్లకంచెల బార్డర్ తో ఆపేయవచ్చు అనుకున్నంత ప్రశాంతంగానే సాగింది.
కానీ, కొద్ది కొద్దిగా తీవ్ర స్థాయికి చేరుకుంటుందని తెలిసి, అసెంబ్లీ ముట్టడి కోసం కెరటం ముంచుకు రాబోతుంది అనే సూచనలు అందడంతో పోలీస్లు అలర్ట్ అయి… ఫినిషింగ్ ముళ్ల తీగకు ఇవతల వరకు వలయంలా నిలిచారు. అసెంబ్లీ రూట్ బ్లాక్ చేస్తున్నట్లు జై రెడ్డి నినాదాలతో పాటు మాకు కావాలి రిజర్వేషన్లు… మాకు సంక్షేమ పథకాలు అందించాలని…నినాదాలు చేస్తూ, రెడ్డి యువనాయకుల సారధ్యంలో అసెంబ్లీ ముట్టడికి కదిలిన రెడ్డి కొదమ సింహాలను నిలువరించడానికి శతవిధాల ప్రయత్నాలు జరిగాయి. ఇది ఒక కదలిక…ఇక ముందు మమ్ముల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమన్నట్లుగా ఇచ్చే ఒక అల్టిమేటం… ఇక ముందు ఎన్నో రెట్ల మహౌన్నత శక్తిగా కదిలిరానున్నామని తెలియజేయడానికి ఈ అసెంబ్లీ ముట్టడి ఒక సూచన మాత్రమే… పోలీసులు లాఠీలు ఝలిపించారు…. అడ్డుపడ్డారు… అడ్డుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్న రెడ్డి బిడ్డలను పట్టి వ్యా లోకి ఎక్కించారు… అయినా, నినాదాలను ఆపలేక పోయారు.
మొత్తం అసెంబ్లీ ముట్టడిలో పాల్గొన్న నాయకులను, రెడ్డి యువకిశోరాలను రెండు గ్రూపులుగా విడగొట్టి, ఒక బృందాన్ని గాంధీనగర్ పోలీస్ స్టేషను, మరో బృందాన్ని నాంపల్లి స్టేషన్ కి తరలించారు. అయినా, సరే స్థలం మారిందే కానీ, నినాదాల సూరు అణచలేక పోయారు. ఇంతకాలం మన మౌనాన్ని, మానవత్వాన్ని మన తెలియనితనంగా, అమాయకత్వంగా భావించిన వారందరికి, ఈ అసెంబీ ముట్టడి వార్తా కథనాలతో, పోరాటానికి సిద్ధం కావలసిన సమయం వచ్చిందని సంకేతం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బుట్టెంగారి మాధవ రెడ్డి మాట్లాడుతూ…రెడ్డి కులస్తులలోని నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలలో ఎటువంటి లబ్ధి చేకూరక అందరి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నారని అవేదన వ్యక్తం చేశారు. రెడ్డిల్లోని నిరుపేదలను గుర్తించి, విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో పిట్ట శ్రీనివాస రెడ్డి, బద్ధం భాస్కర్ రెడ్డి, కరుణాకర్ తో పాటు రెడ్డి జాగృతి ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
మీ గొంతుకై ప్రతిధ్వనిస్తాం – రెడ్డి భరోసా యాత్ర :
“ ఆత్మహత్యలు వద్దు – ఆత్మగౌరవం ముద్దు” అనే నినాదంతో గ్రామ స్థాయిలో నివసిస్తున్న రెడ్డి కుటుంబాల పరిస్థితులను అధ్యయనం చేయడానికి, రెడ్డి విద్యార్థులు, యువత, రైతులు ఆత్మహత్యలు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపధ్యంలో వారికి మేమున్నామని భరోసా కల్పిస్తూ “రెడ్డి జాగృతి” ఆధ్వర్యంలో నిజామాబాద్ నుండి రెడ్డి అధ్యయన – రెడ్డి భరోసా యాత్ర పేరుతో బస్ యాత్ర ప్రారంభించారు.
నిజామాబాద్ నుండి ఉదయం 8 గంటలకు మొదలైన రెడ్డి అధ్యయనం, రెడ్డి భరోసా యాత్ర మోహల్ గ్రామం మీదుగా ముల్లంగికి చేరుకుంది. రెడ్డి భరోసా యాత్రకు స్వాగతం పలకడానికి ప్రతీ గ్రామంలో రెడ్డి బంధువులు ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో ఉన్న రెడ్డి బంధువులను కలుసు కొని రెడ్డి జాగృతి బృందం లక్ష్యాలను వివరిస్తూ , నిరుత్సాహ పడవద్దని… రైతు బాంధవులకు మేము న్నామని భరోసా కల్పిస్తూ.. మీ తరుపున మేము నిలుస్తామని ధైర్యాన్నిస్తూ ముందుకు సాగింది. నిజామాబాద్ జిల్లాలో గల తెలంగాణ యూనివర్సిటీ… నుండి ముందుకు సాగి రెడ్డి అధ్యయన భరోసా యాత్ర నిజమాబాద్ జిల్లాలో రామగుడ, దుబా, బోర్లం,సుద్దలం, మోపలు, ధరవల్లి గ్రామాలలో జరిగిన రెడ్డి అధ్యయనం, భరోసా యాత్రకు మద్దతు ఇచ్చిన రెడ్డి బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు.
రెండో రోజు నిజామాబాద్ జిల్లాలో కమ్మర్ పల్లి, రేకులపల్లి, “పెరుగట్ల తదితర గ్రామాలలో ఈ యాత్ర సాగింది. జన్నారంలో – విజయవంతంగా సాగిన రెడ్డి భరోసా యాత్ర మంచిర్యాలకు – సాగుతున్న రెడ్డి అధ్యయన మరియు భరోసా యాత్ర కొనసాగింది. రాత్రి చీకటి, చలిని అధిగమిస్తూ రెడ్డి జాగృతి బృంధం, రెడ్డి బంధువులు కలిసి సమావేశం నిర్వహించారు.
హిమ్మత్ నగర్ ఆగ్రామం మారం వల్లెలో ఆత్మహత్య చేసుకున్న మారంమధుకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన రెడ్డి జాగృతి సభ్యులు మాట్లాడుతూ మన హక్కులు, సంక్షేమం సాధించుకునే రోజు… మరెంతో దూరం లేదన్నారు. ఇన్నాళ్ళుగా ఎన్నో కష్టాలకు ఓర్చుకొని భరిస్తూ వచ్చాము.
మన పోరాటం ఫలితాలు అందబోతున్న ఈ తరుణంలో ఆత్మసైర్యం కోల్పోవద్దన్నారు. పోరాడి సాధించుకుందామని దానికోసం రెడ్డి జాగృతి మీ వెంట నిలుస్తుందన్నారు.
తుమ్మనపల్లి గ్రామం హుజురాబాద్ మండలంలో నిరుద్యోగ విద్యార్థి తన ప్రతిభకి తగిన గుర్తింపు రాలేదని తన పరిస్థితులను గురించి వివరించారు.
ఇలా అడుగడుగునా, రెడ్డి బంధువుల ఆదరాభిమానాల మధ్య ప్రారంభమైన యాత్ర గ్రామాలలో రెడ్డి బంధువులు, రైతులు, విద్యార్థులతో మమేకమవుతూ.. ప్రభుత్వ ఫలితాలకు రిజర్వేషన్లు మోకాలడ్డి అగమ్య గోచరంగా ఉన్న పేద రెడ్డి బ్రతుకు చిత్రాన్ని ఆకలింపు చేసుకున్న రెడ్డి జాగృతి నిరంతరం రెడ్డి సంక్షేమం, హక్కుల సాధనకై పోరాడుతూనే , రెడ్డి బంధువులకు స్నేహహస్తాన్ని అందించేందుకు నిరంతరం పాటుపడతామని సభ్యులు తెలిపారు.
మేధోమధన సదస్సు :
రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో 16 & 17 సెప్టెంబర్ 2017న నాగోల్ జె వ్యాలీలో నిర్వహించిన రెండు రోజుల మేధోమధన సదస్సు విజయవంతం అయింది. ఈ రెండు రోజుల సమావేశంలో 16వ, తేదిన ఉదయం 10 గంటలకు రెడ్డి జాతి మూలపురుషుడిగా కీర్తించబడుతున్న ప్రజాకవి యోగి వేమారెడ్డికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసిన రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షులు, రెడ్డి హెల్ప్ లైన్ ఫౌండర్ శ్రీ కేవీ రెడ్డి గారు, ఇతర రెడ్డి బంధువుల సమక్షంలో ప్రారంభం అయింది.
సమావేశంలో మొదటిగా రెడ్డి చారిత్రక వైభవాన్ని గురించి, రెడ్డి రాజుల రాజ్యవైభవాన్ని గురించి, నేటి తరాలకు అందించే విధంగా స్ఫూర్తి కలిగించే విధంగా చర్చించడం జరిగింది. రెడ్డి విద్యార్థి, యువత, రైతు, మహిళా హక్కులు మరియు సంక్షేమం సాధనకై ఉద్యమాన్ని మరింత ఉ దృతం చేసేందుకు ఏర్పాటు చేయబడిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే గాక పక్క రాష్ట్రాల నుండి రెడ్డి బంధువులు హాజరయ్యారు.
రెండవ రోజు వివిధ స్థాయిలో రెడ్డి జాగృతి కమిటీలలో పనిచేస్తున్న టీం సభ్యులతో కూలంకషంగా చర్చించడం జరిగింది. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయిలో మన సమాచారాన్ని , భావజాలన్ని వ్యాప్తి చేసేందుకు గల అవకాశాలను గురించి, రెడ్డి బంధువులతో , ప్రముఖులు, మేధావులు, వివిధ రంగాలలో నిష్ణాతులతో చర్చించి పలు కీలక నిర్ణయాలను ప్రకటించడం జరిగింది.
రెడ్డి జాగృతి మేధోమధన సదస్సులో ప్రవేశపెట్టిన తీర్మానాలు:
1. రెడ్డి చరిత్ర, సంస్కృతి పరిరక్షణ, చారిత్రక ఆధారాల పరిరక్షణ
2. రెడ్డి విద్యార్థి, యువత ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు
3. రైతుల సమస్యలు, సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వ చేయూత
4. రెడ్డి మహిళ సమస్యలు ఆర్థిక – రాజకీయ సామాజిక సాధికారత
5. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, స్వయం ఉపాధి, సహకార రంగాలలో ప్రభుత్వ చేయూత
6. ప్రపంచవ్యాప్త రెడ్ల అభివృద్ధి, అభ్యున్నతి ఐక్యత, సంస్కృతి అధ్యయనం
రెడ్డి జాగృతి, రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలోని గౌరెల్లి – తారామతిపేటలోని రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి ప్రాంగణంలో 27 మే 2018 సాయంత్రం 4 గంటలకు “ రెడ్ల సమర భేరి ” మొదలయింది. స్వచ్చందంగా ఈ కార్యక్రమానికి నలుమూలల నుండి రెడ్డి బంధువులు భారీ సంఖ్యలో హైదరాబాద్ బాటపట్టారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రెడ్డి యువత ముందుగా ర్యాలీగా రెడ్ల సమర భేరికి కదిలారు. పెద్దమొత్తంలో జనాభా రోడ్ల మీదకి చేరుకున్నా సరే, ఇతర వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా గ్రౌండ్ కి చేరుకునే ప్రయత్నం చేశారు. అగ్రవర్ణం పేరుతో ముద్ర వేసి, ఏ ప్రభుత్వ పథకానికి నోచుకోక, ఏ రాయితీలు అందకపోగా, కాకిని కొట్టి గద్దకు వేస్తున్న చంధంలో వ్యవహరిస్తున్న రీతికి విసిగి వేసారి ఉన్నా, శాంతియుతంగా హక్కుల పోరాటానికి, నిరసన తెలియజేస్తు వచ్చిన రెడ్డి బంధువులు, సాయంత్రం 4లోగా సభాస్థలికి చేరుకున్నారు. వాతావరణం కూడా మనకు సహకరించిందా అన్నట్లు మేఘావృతం అయి భానుని కిరణాలను దాచేసింది ఎలాంటి కష్టం కలగకుండా.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి, రేవంత్ రెడ్డి, గద్వాల ఎమెల్యే డికే అరుణ, కార్తీక్ రెడ్డి, మాజీ ఎంపి జయప్రద, మల్ రెడ్డి రంగారెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డితో పాటు వివిధ రెడ్డి సామాజిక వర్గం కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా రెడ్డి నేతలు, గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు రెడ్ల సంక్షేమం కోసం కృషి చేస్తున్న రెడ్డి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపుగా 5 లక్షల పైచిలుకు రెడ్డి బంధువులు ఈ కార్యక్రమంలో పాల్గొని, అందరి దృష్టిని రెడ్ల సమర భేరి వైపు మరల్చేలా చేశారంటే ఆశ్చర్యం లేదు.
రెడ్ల సమర భేరి వేదిక నుండి… చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక నిధులతో పేద రెడ్లకు చేయూతను ఇచ్చే విధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, విద్యా ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు, రెడ్డి విద్యార్థులకు ప్రత్యేక గురుకులాలు, పూర్తిస్థాయి ఫీజు రీయంబర్స్ మెంట్ వర్తింపు, విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్య కోసం విదేశీ విద్యా నిధి ఏర్పాటు, కటాఫ్ మార్కులు, వయోపరిమితి సడలింపు వర్తింపజేయడం, 60 ఏళ్లు నిండిన రైతులకు అన్నదాత పేరుతో 5 వేల రూపాయల పింఛను మంజూరు, స్వయం ఉపాధి రంగాలలో యువతకు ప్రభుత్వం నుండి చేయూత. పొలం బాటలో మరణించిన రైతన్న కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
రెడ్ల సమర భేరి ప్రతి రెడ్డి బంధువుకు మేలు కలిగే విధంగా, విద్యార్థులకు, రైతులకు , యువత, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రభుత్వ ప్రతినిధిగా సభకు ఆహ్వానించిన నాయిని నరసింహా రెడ్డి, మన డిమాండ్లపై ప్రభుత్వం నుండి త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం వస్తుందని, ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పటి ఆర్థిక స్థితిగతులు ఇప్పటికి ఆపాదించి, అగ్రవర్ణం పేరుతో 80 శాతం పేదరికం ఉన్న రెడ్లను అన్ని సంక్షేమ పథకాలకు దూరం చేయడం సరియైనది కాదని, రాజ్యాంగంలో సవరణలు కొత్త కాదని, ప్రజల క్షేమం దృష్టిలో ఉంచుకొని, తగిన విధంగా సవరణలు చేసి, పేద రెడ్లకు సరియైన న్యాయం జరిగే విధంగా చూడాలని వక్తలు ఉద్ఘాటించారు.
అగ్రకులాలలో పేదలు ఉన్నారనీ, రెడ్డి సామాజిక వర్గంలోనూ… పిల్లలను స్కూళ్లకు పంపలేని కుటుంబాలు ఉ న్నాయనీ, కళ్యాణలక్ష్మి పథకం వర్తించే విధంగా, అదే విధంగా జిల్లాలవారీగా గురుకులాల ఏర్పాటుకు చర్యలు తీసుకునే విధంగా చూస్తామని, సాధించే వరకు మీ వెంట నేనున్నానని నాయిని నరసింహా రెడ్డి హామీ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర జనాభాలో 15 శాతం ఉన్న రెడ్లకు 1.70 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 100 కోట్లు కేటాయించలేక పోయారా అని, రెడ్డి అంటే పౌరుషం, సహనంతో కూడిన సహాసం, ఆపదలో ఉన్న వాడిని ఆదుకునే తత్వం, రెడ్డి కులం కాదని ఒక గుణమని, ఐదు లక్షల పైగా రెడ్డి బంధువులు ఒక చోట చేరి, రెడ్డి సమరభేరి నిర్వహిస్తుంటే, కనీసం చిన్న టీవి సోలింగ్ కూడా వేయలేక పోయారా…. అని మీడియాను విమర్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి బలిదానాలు ఎక్కడకి పోయాయని, తెలంగాణ రాష్ట్ర సాధనలో రెడ్లను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారన్నారు.
ఈ 20% రెడ్లు మాత్రమే… మీరు అనుకునే స్థాయిలో ఉన్నారని, మిగిలిన 80 శాతం మంది రెడ్లు పేదరికంలోనే ఉన్నారని, అగ్రవర్ణం పేరుతో ఈ 80 శాతం మంది బ్రతుకును కూడా రోడ్డు మీదకి ఈడుస్తున్నారని ఆరోపించారు. అగ్రవం షం పేరుతో పేదలకు కూడా సంక్షేమం అందకుండా చేస్తున్నారని, రిజర్వేషన్లు కులం పేరుతో కాకుండా, ఆర్థిక పరిస్థితి దృష్టా కల్పించే విధంగా చర్చలు జరగవలసిన అవసరం ఎంతైనా ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు.
రెడ్ల సమరభేరి జరిగిన తరువాత ప్రభుత్వం దృష్టి కోణంలో మార్పు సుస్పష్టంగా తెలిసింది. సభ జరిగినది. జూన్లో హుజూరాబాద్లో రైతుబంధు పథకం ప్రారంభించిన సందర్భంగా అగ్రవర్ణ పేదలకు కూడా సాయం అందే విధంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందని సి.యం కేసిఆర్ ప్రకటించారు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది. ఆ తరువాత రాష్ట్ర బడ్జెట్ లో కూడా రెడ్డి హాస్టల్ డెవలెప్ మెంట్ కోసం, రెడ్డి కమ్యునిటీ హాల్ కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు.