రెడ్డిరాజుల కులదైవం మూలాంకురేశ్వరీదేవీ.

కొండవీటి రెడ్డిరాజుల కులదైవం మూలాంకురేశ్వరీదేవీ. జననానుడిలో మూల గూరమ్మ లేదా గురమ్మ అనేవారు. ఈ అమ్మవారు గుంటూరు జిల్లా నర్సరావుపేట తాలూకా ఫిరంగిపురం మండలం అమీనాబాద్ దగ్గర కొండ మీద కొలువై ఉ న్నది. కొండవీడుకు ఫిరంగిపురం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

రుక్మిణి … శ్రీకృష్ణుడికి మనసివ్వడం, ఆయన విషయంలో తండ్రినీ … సోదరుడిని ఎదిరించడం చేస్తుంది. రుక్మిణి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్లు ఆమెని శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు ఆలయానికి వచ్చిన ఆమెని అపహరించుకు వెళ్లి వివాహమాడతాడు.

 

ద్వాపరయుగంలో జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ కూడా ఆసక్తికరంగా … ఆనందకరంగా అనిపిస్తూ వుంటుంది. గుంటూరు జిల్లా ‘అమీనాబాద్’లో గల ‘మూలాంకురేశ్వరీదేవి’ ఆలయమే ఈ సంఘటనకు వేదికగా నిలిచిందని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. రుక్మిణీదేవి పూర్వీకుల నుంచి ఈ అమ్మవారిని ఇలవేల్పుగా ఆరాధించేవాళ్ళు.

మూలాంకురేశ్వరీదేవి అనుగ్రహంతోనే రుక్మిణీదేవి వివాహం కృష్ణుడితో జరిగిందని చెబుతారు. తమని తరుముతూ వచ్చిన రుక్మిణీదేవి సోదరుడికి కృష్ణుడు తగిన బుద్ధి చెప్పిన ప్రదేశం కూడా ఇక్కడికి దగ్గరలో వుందని చూపుతుంటారు. సాధారణంగా దక్షిణ భారతంలో శ్రీరాముడితో ముడిపడిన క్షేత్రాలు కనిపిస్తాయిగానీ, శ్రీకృష్ణుడి సంబంధిత ఘట్టాలకు వేదికగా నిలిచే క్షేత్రాలు పెద్దగా కనిపించవు.

అలాంటిది ఇది ద్వాపరయుగం నాటి క్షేత్రంగా చెప్పబడుతూ వుండటం, చిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. రుక్మిణీదేవి అనునిత్యం అర్చించిన అమ్మవారు … శ్రీకృష్ణుడు రథంపై వచ్చి ఆగిన ప్రదేశం ఈనాటికీ ఇక్కడ ప్రత్యక్షంగా దర్శనమిస్తూ వుంటాయి. ఆనాటి ఆనవాళ్లను అపురూపంగా కళ్ల ముందుంచే ఈ క్షేత్రం, మహిమాన్వితమైనదిగా మనసు దోచుకుంటోంది.

 

ఈ ఆలయ నిర్మాత 13వ శతాబ్దం మధ్య కాలంలో కొండవీటిని పాలించిన అనవేమారెడ్డి. ఆయన యుద్ధంలో తనకు చేకూరిన విజయానికి చిహ్నంగా అమీనాబాదులో ఈ కొండమీద ఈ ఆలయం నిర్మించాడు. ఆది పరాశక్తే ఈ మూలాంకురేశ్వరీదేవి. ఈవిడ రెడ్డి రాజుల కులదైవం. ఇక్కడ వున్న కొండ మీద ఏటవాలుగా ఒక ఫలకం మీద వున్న శాసనం జారుడు బండ శిలాశాసనాల ద్వారా ఈ విషయం వెల్లడి అవుతుంది. అంతే కాదు. ఆలయం కట్టించినప్పుడు అనవేమారెడ్డి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం 5 గ్రామాల పంట భూమని దానంగా ఇచ్చారు. ఈ ఆలయంలో ముందు ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, దానికి ముందు యజ్ఞ మండపం వున్నాయి. పూర్వపు రాజులు ఇక్కడ అనేక యాగాలు చేశారు. ఇప్పటికీ ఈ మండపంలో యజ్ఞాలు జరుగుతూ వుంటాయి.

 

అమ్మవారు విశాలమైన నేత్రాలతో, పచ్చని ముఖంతో చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తారు. దేవి ముందు శ్రీచక్రం వున్నది. 1415 సంవత్సరంలో కొండవీటి రాజుల్లో చివరి వాడైన

రాచవేముని కాలంలో నిర్మించబడిన సంతాన సాగరం (ఇప్పటి మల్కా చెరువు) కొండకు సమీపంలోనే వున్నది. ఇక్కడ ఇంకా అనేక శిలాశాసనాలు దొరికాయటగానీ పరిష్కరింపబడలేదు. అనినుల్ ముల్క్ అనే గవర్నర్ తన పేరు మీద ఈ గ్రామం పేరుని అమీనాబాద్ గా మార్చాడట.

కాలక్రమంలో ఆలయ పంట భూములన్నీ హరించుకుపోగా, అమ్మవారికి నిత్య ధూప దీప నైవేద్యాలే కష్టమయినాయి.


అటువంటి సమయంలో శ్రీ శంకరమంచి రాఘవయ్య కుమారుడు శ్రీ శంకరమంచి రాధాకృష్ణ మూర్తి ఆలయ అర్చక బాధ్యతలను స్వీకరించారు.

కొండకింద వున్న పోలేరమ్మ ఆలయం, మధ్యలో వున్న సుబ్రహ్మణ్యేశ్వరుడు, అయ్యప్ప స్వామివార్ల ఆలయాలు తర్వాత నిర్మింపబడ్డవి. శివాలయం పురాతనమైనదే. ఆలయ ప్రాంగణంలో వున్న వేప రావి చెట్లని దర్శిచిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. రోజూ భక్త జన సందోహం అంతగా లేక పోయినప్పటికీ, ప్రతి శుక్రవారం ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలకి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.


2001లో జరిగిన ఒక సంఘటనతో ఇక్కడి భక్తులలో అమ్మవారిమీద నమ్మకం మరింత పెరిగింది. ఆ సంవత్సరం జరిగిన దసరా ఉత్సవాలలో 14 ఏళ్ళ అమ్మాయి పొరపాటున యజ్ఞమండపం నుంచి జారి 80 అడుగుల కింద వున్న బండలమీద పడింది.


అంత ఎత్తుమీదనుంచి పడినా ఆ అమ్మాయికి చిన్న గాయం కూడా కాలేదు. అమ్మవారి దయవల్లనే ఆ అమ్మాయికి ఏ గాయం కాలేదని భక్తుల నమ్మకం. ఈ గ్రామంలో అధిక జనాభా వ“ముస్లింలదే. అయినా వారంతా అమ్మవారిపై విశ్వాసంతో, మత సామరస్యంతో కలిసి మెలిసి వుంటారు.