ప్రాచీన చరిత్ర, సంపదలకు నిలువెత్తు సాక్ష్యం కొండవీడు కోట. 1700 అడుగుల ఈ గిరిదుర్గం శత్రు దుర్భేద్యంగా ప్రసిద్ధి చెందింది. కొండవీడును శత్రుదుర్బేధ్య రాజ్యంగా తీర్చిదిద్దడమేగాకుండా, ప్రజాకాంక్ష పాలనను కొనసాగించిన ఘనత రెడ్డిరాజులది. వారు కొండవీడుకోటను రాజధానిగా చేసుకుని క్రీ.శ. 1325 నుంచి 1420 వరకు పరిపాలించారు. రాజ్యాన్ని ఉదయగిరి నుంచి కటక్ వరకు విస్తరింపజేసిన పరాక్రమ ధీరులు. రెడ్డిరాజుల పాలనాకాలం వ్యాపార, సంగీత, సాహిత్య, నాట్యాలకు సువర్ణయుగంగా భాసిల్లింది.
అద్భుత నిర్మాణ శైలి
కోట నిర్మాణశైలి అద్భుతంగా ఉంటుంది. గిరి దుర్గం చుట్టూ ఉన్న ప్రాకారం పొడవు 20 కిలోమీటర్లు. ప్రతి కొండ శిఖరాన్నుండి మరో కొండ శిఖరాన్ని తాకుతూ కొండవీడు కోటలోని అన్ని శిఖరాలను, మధ్యలో వచ్చే బురుజులను కలుపుతూ ప్రాకారం ఉంది. శత్రువులు చొరబడకుండా రెండు కొండలను కలుపుతూ 50 అడుగుల ఎత్తు, వెడల్పు ఉండేలా మట్టికట్టను నిర్మించారు. కొండ దిగువన చుట్టూ భారీ కందకాలను ఏర్పాటు చేసి వాటి నిండా నీటిని నింపి మొసళ్ళను వదిలి అగడ్తగా రూపొందించారు. ప్రాకారం మధ్యలో అనేక నిర్మాణాలను రెడ్డిరాజులు అద్భుతంగా తీర్చిదిద్దారు. కోట రక్షణ కోసం కొండల అంచున 24 బురుజులను నిర్మించి సైనికులను కాపలాగా ఉంచేవారు. బురుజుల్లో ప్రధానమైనవి తారా బురుజు. దీనినే చుక్కల బురుజుగా వ్యవహరిస్తారు. వీటి తరువాత మహాద్వారం వైపున ఉన్న జెట్టి, నెమళ్ళబురుజు, రమణాల్ బురుజు, సిట్రియం , ఖల్లా ముడు, యంయంట్టు ముడులు ముఖ్యమైనది. పైన రాజ, To కోటలు, ధాన్యాగారం, వజ్రాగారం, కారాగారం, అశ్వ, గజ శాలలు, నేతి కొట్టు, తీర్పుల మందిరాలను ఏర్పాటు చేశారు.
అద్భుత కోట నిర్మాణం
కొండలపై రాజప్రాసాదాలలో నివసించే వారికి, సైనికులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ముత్యాలమ్మ, పట్టాలమ్మ, వెదుళ్ళ చెరువులు తవ్వించారు. వర్షాలు కురిసినప్పుడు ఒక దాని తరువాత ఒకటి నిండేలా వాటిని మలచడం, ఎక్కువైన నీటిని బయటకు పంపేందుకు మత్తిడిని (తూము) నిర్మించడం విశేషం.
కొండవీడులో అన్నిటికన్నా ఆసక్తిని కలిగించేవి ఇక్కడి బావులు…. ఇంత ఎత్తైన కొండపై ఇంతింత లోతు బావుల్ని ఎలా తవ్వించారన్నది ఊహకందదు… వీటి నుంచి నీళ్లు తోడేందుకు చాలా పొడవైన చాంతాళు వాడేవారు. అందుకే ‘కొండవీటి చాంతాళ్లు’ అన్న నానుడి వచ్చింది.
అద్భుత శిల్పసంపద :
కొండవీడు రెడ్డి రాజులు నిర్మించిన గోపీనాథస్వామి దేవాలయాన్నే కత్తులబావి, చీకటి కోనేరు అని పిలుస్తారు. వెన్నముద్దల బాలకృష్ణుని విగ్రహం తొలిగా ప్రతిష్టించింది గోపీనాథస్వామి ఆలయంలోనే. కొండవీడు
ప్రాంతంలో ఉన్న అపార శిల్ప సంపద నాటి అద్భుత కళలకు ప్రతీకలు. ఎక్కడ చూసినా రాతి శిల్పాలు, దేవతామూర్తుల విగ్రహాలు, విశిష్ట కట్టడాలు ఆకట్టుకుంటాయి. గ్రామాల్లో, పంట పొలాల్లో దేవతా, నంది విగ్రహాలు ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి.
దేవాలయాలుకొండవీడు కొండల పై, దిగువన రెడ్డిరాజులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. కొండలపై లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, బల్లుమోర వెంకటేశ్వరస్వామి ఆలయం, మశీదు, దర్గాకొండ, దిగువన కొత్తపాలెంలోని వీరభద్రస్వామి ఆలయం, కొండవీడులోని రామలింగేశ్వరస్వామి ఆలయం, కోట గ్రామం పరిధిలోని గోపీనాథస్వామి దేవాలయం, ఫిరంగిపురం మండలం అమీనాబాద్ కొండపై ఉన్న మూలాంకురేశ్వరి అమ్మవారి ఆలయాలు ప్రధానమైనవి.
చారిత్రక మూలాలు:
కాకతీయుల సామ్రాజ్యం ముగిశాక తెలుగు గడ్డను రక్షించుకునేందుకు కాకతీయ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న 74 మంది రాజులు ఏకతాటిపై ఉండి ముస్లిం పాలకుల చెర నుంచి కోస్తా ఆంధ్ర విముక్తికి ప్రతినబూనారు. రెడ్డి రాజులలో ప్రథముడు ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులలో ప్రథముడు. ఇతను తొలుత సా.శ.పూ. 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 1353 వరకు పరిపాలించాడు.
ఆ తరువాత అతని కుమారుడు అనపోతారెడ్డి సా.శ.పూ. 1353 నుండి 1364 వరకు రాజ్యపాలనను చేపట్టినట్లు తెలుస్తుంది. శత్రుమూకలు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడని తెలుస్తుంది.
అనపోతారెడ్డి కొండవీడును శతృదుర్బేధ్యమైన గిరిదుర్గంగా మలచిన ఘనత అనపోతారెడ్డికి దక్కుతుంది. ఆ తరువాత అనపోతారెడ్డి తమ్ముడు అనవేమారెడ్డి సా.శ.పూ. 1364 నుండి 1386 వరకు రాజ్యా ధికారం చేపట్టి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ గావించాడు. తిరిగి పినతండ్రి అనవేమారెడ్డి మరణానంతరం అనపోతారెడ్డి కుమారుడు కుమారగిరిరెడ్డి సా.శ.పూ. 1386 నుండి 1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్ వరకు విస్తరించాడు.
అనవేమారెడ్డి కుమారుడు పెదకోమటి వేమారెడ్డి సా.స.పూ. 1402 నుండి 1420 వరకు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. ఇతని పరిపాలనా కాలంలో సాహిత్యానికి, కళలకు పెద్దపీటవేసి ఆదరించినట్లుగా తెలుస్తుంది. ఈ కాలాన్ని స్వర్ణయుగమని చెప్పవచ్చు. శ్రీనాథ కవి ఇతని ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడని తెలుస్తుంది.సా.శ.పూ 1420 నుండి 1424వరకు రాచవేమారెడ్డి పరిపాలించాడు. విజయనగర రాజులు కొండవీడును హస్తగతం చేసుకున్నారు.
కొండవీడుకు పూర్వ వైభవం..
కొండవీడును ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూనుకుంది. 2007లో ఘాట్ రోడ్ నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015లో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభయ్యాయి. మరో రెండు నెలల్లో ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత కొండలపైన చదునుగా ఉన్న 2 వేల ఎకరాలలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో కొండవీడు ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటక శాఖ కోట వద్ద ముఖద్వారాన్ని, మెట్ల మార్గం వద్ద సమాచార కేంద్రాన్ని నిర్మించింది. దేవాదాయ, ఆర్ఎండ్ బీ, పురావస్తుశాఖలు వివిధ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
కొండవీడు మార్గాలు ఇలా..
కొండవీడుకోట యడ్లపాడు మండలం పరిధిలో ఉంది. ఈ కోటను చేరుకోవడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. చిలకలూరిపేట – గుంటూరు మధ్య జాతీయ రహదారి నెం. 5 నుంచి బోయపాలెం, చెంఘీజ్ ఖాన పేట మీదుగా కొండవీడుకు చేరుకోవచ్చు.
గుంటూరు – నరసరావుపేట మార్గంలో ఫిరంగిపురం నుంచి కొండవీడు చేరేందుకు మరో మార్గం ఉంది. ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి కొండవీడు మీదుగా ఫిరంగిపురంకు పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కొండవీడుకు ప్రైవేటు వాహనాల ద్వారా వెళ్లి మెట్ల మార్గం ద్వారా కొండపైకి ఎక్కేందుకు అవకాశం ఉంది. జాతీయ రహదారి నెం. 5కు సుమారు పది కిలోమీటర్ల దూరంలో కొండవీడుకోట ఉంది.
రెడ్డి హక్కుల సాధన కోసం పోరాటం చేస్తూనే, రెడ్ల వారసత్వ సంపదగా నిలచిన చారిత్రక ప్రదేశాలను, రెడ్డి రాజుల చరిత్ర తార్కాణాలను పరిరక్షిస్తూ, భావితరాలకు రెడ్ల చరిత్ర మహోన్నతుల గురించి తెలిపేదిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే రెడ్డి జాగృతి వెబ్ సైట్ ద్వారా రెడ్ల చరిత్రను, మరియు లబ్ధప్రతిష్టులైన రెడ్డి మహామనుషుల గురించి తెలియజేస్తుంది. అంతే కాదు… కొండవీడు కోటపై 2018 స్వాతంత్ర దినోత్సవం జరుపుకొని యువత దృష్టి చారిత్రక అంశాలవైపు నిలపే ప్రయత్నం చేసింది. ఇదే రోజు రెడ్డి వారసత్వ వారోత్సవాలు ప్రారంభించి, యువతకు రెడ్డి చారిత్రక విషయాలు తెలియజేయడంలో మేము సైతం… కదలడం జరిగింది.