ఆపదకాలంలో సాయం కోసం రెడ్డి అని పిలిస్తే రెడీ అనేవాడు రెడ్డి. ఒకనాటి చారిత్రక సామ్రాజ్యాలకు, నేటి పరిపాలన విధానానికి మధ్య వారధిగా, బ్రిటీష్ సామ్రాజ్యంలో ట్యాక్స్ కలెక్టర్ గా , నైజాం రాజ్యంలో పాలకుడిగా , అపరభగీరధుడిగా, రైతునేస్తంగా పూజలందుకున్న ఎందరో మహోన్నతులు, ఎన్నోరంగాలలో అలుపెరగని సేవను మన భారత దేశానికి అందించిన ఘనత మన రెడ్డి జాతిది. డొక్కల కరువులో కూడా వందలాది మందికి ధారాళంగా అన్నదానం చేసిన బుడ్డా వెంగళరెడ్డిని చరిత్ర కీర్తించక మానదు.

 

ప్రతి ఒక వర్గాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న మనం… రాజ్యాంగ వివక్ష కారణంగా మన కోల్పోయిన హక్కుల కోసం, సంక్షేమం కోసం పోరాడవలసిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం దృష్టిలో, రాజ్యాంగం దృష్టిలో అందరూ సమానమే అని చెప్తూనే అగ్రవర్ణం ముద్రవేసి, సంక్షేమం నుండి ఆమడ దూరంలో పెట్టి, అధ్వాన్నమైన పరిస్థితికి తెచ్చారు. ఇంకా మనం గొంతు విప్పికుండా ఇలాగే చోద్యం చూస్తూ కూర్చుంటే… గత చరిత్ర ఘనం… మరి వర్తమానం ప్రశ్నార్థకం… భవిష్యత్తు అంధకారం.

 

సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం …. అని ప్రవేశికలో చాటుకుంటూ… వెనకబాటు కారణం చూపించి, 70 సంవత్సరాలుగా ప్రభుత్వం సకల సౌకర్యాలతో కొన్ని వర్గాలను చూస్తూ, వాటి పోషణ నిమిత్తం కావలసిన ధనం సంపాదించి పెట్టడానికే అగ్రవర్ణాలు అనే రీతిలో, ప్రవేశ పరీక్ష నుండి మొదలు ఉద్యోగంలో పదోన్నతుల దాకా, మన సమాధులపై వారికి పట్టుపరుపులు వేసి సేద తీరుస్తున్నాయి.

 

నిరాదరణకు గురై, వివక్షలో మగ్గిన వర్గాలకు ఖచ్చితంగా ప్రత్యేక రాయితీలు, పథకాలు అమలు చేయాలి. వారి వర్గ ఉన్నతికి తోడ్పాటు అందించాలి… దీనిని ఎవ్వరూ ఆక్షేపించరు. కానీ, అదే సాకుగా గత 70 సం||లుగా ఎటువంటి సమీక్ష లేకుండా కొనసాగిస్తుంది. 10 సం||లకి ఒకసారి ఈ రిజర్వేషన్లపై సమీక్ష జరిగి, వారి ఉన్నతి ఆధారంగా రాయితీల కల్పనలో మార్పు తేవాలి. కానీ… జరుగుతున్నది ఏంటి…?

 

రాజ్యాంగం వివక్షతో మనము కోల్పోతున్న హక్కుల కోసం , సంక్షేమం కోసం చిత్తశుద్ధి, పట్టుదల, నిరంతరం పోరాడటానికి విశిష్టమైన ఆలోచన, ఆచరణ దృడసంకల్పం కలిగి మన లక్ష్యాన్ని సాధించటానికి ఒక వేదిక ఉండాలనే ఆలోచనకు కార్యరూపమే మన రెడ్డి జాగృతి.

 

రెడ్డిజాతి సంక్షేమం కోసం మూలం నుండి మార్పు రావాలంటే, వ్యవసాయం చేస్తూ అప్పులపాలై, మెడకి ఉరితాడుతో అలంకరించుకుంటున్న మన రైతుల స్థితిగతులను మొదలుకొని, ఉద్యోగం, ఉపాధి అవకాశాలలో ఎలాంటి అవకాశాలు లేక, ఎండమావులై ఊరిస్తూ, చివరకి నిరాశ మధ్య మసులుతున్న యువత వరకు వివిధ స్థాయిలలో మార్పు రావాలి. దీని కోసం ఏ సేవాసంస్థ వల్లనో, కొంత మొత్తం నిధులతోనో సాధ్యం కాదు. వేల కోట్ల నిధులు అవసరం అవుతాయి , మనము సంక్షేమ సంఘాల తో ఆ లక్ష్యాన్ని సాధించలేము , కావున ఆ నిధులను సాధించుకొనుటకు ఐక్యతతో పోరాడి, ప్రభుత్వం మెడలు వంచైనా సరే సాధించాలి. అందువల్లనే, ఒక పటిష్టమైన వేదిక ఏర్పాటు కోసం విశాలమైన భావంతోనే,

ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా, రెడ్డి హక్కుల సాధన ఉద్యమమే ద్యేయంగా, రెడ్డి రిజర్వేషన్స్ , రెడ్డి కార్పొరేషన్ , సంక్షేమం , హక్కుల సాధనే లక్ష్యం గా, ఎలాంటి స్వార్ధము , లాభాపేక్ష , సంకుచిత భావాలూ లేకుండా పూర్తిగా పార్గదర్శకంగా మన హక్కుల సాధనకోసం, విశ్వవ్యాప్తంగా రెడ్డి ఐక్యత కోసం ఏర్పాటు చేసిన వేదికే రెడ్డి జాగృతి.

 

ప్రతీ అంశాన్ని, ప్రతీ రెడ్డి పరిస్థితిని, యువతీ, యువకుల సాధక బాధకాలను అధ్యయనం చేసిన , విద్యావంతులు , ప్రముఖుల ఆలోచనలతో ఏర్పాటు చేసిన వేదిక రెడ్డి జాగృతి. ఈ వేదిక ఏ ఒక్కరికో సొంతం కాదు. మీ గొంతుకై ప్రతిధ్వనిస్తుంది. అందరూ తన, మన, చిన్న, పెద్ద అనే బేధాలు వదిలేసి, విశ్వవ్యాప్తంగా ఒకే వేదికకి నాయకత్వం వహించడానికి ముందుకు కదలండి. సమిష్టి నాయకత్వంలో పోరాటం చేయడానికి విద్యార్థులు, యువతీ యువకులు, రైతులు సిద్ధంగా ఉన్నారు.

 

ఇప్పటికే గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి దాకా రెడ్డి హక్కుల సంక్షేమం కోసం పోరాడే ఎన్నో వేదికలు ఉన్నా సరే, సంక్షేమ సాధనలో ఒక్కటై ముందడుగు వేసి, మన బాధలు ముక్తకంఠంతో వినిపించలేక పోయాయి. ఈ పోరాటం నీది, నాది కాదు, మన అందరిది , మనం వేసే ప్రతీ ఒక అడుగు ఎన్నో జీవితాలకు వెలుగునిస్తుంది. అనే ఆశయాన్ని ఊతంగా చేసుకొని ఏర్పాటైన వేదిక ఈ రెడ్డి జాగృతి.

 

ప్రభుత్వం చేసే ప్రతి చట్టం ఏదో ఒక వర్గానికి చుట్టంగా మారుతూ, మన అస్థిత్వానికి ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఇది మన జీవితం. మన తాతలు… తండ్రులు మౌనంగా భరించారు. ఉన్నంతలో సర్దుకొని రెడ్డిగారి కిరిటం కిందనే బ్రతుకులీడ్చాం… భరించినందుకే మన జీవితం ఇలా తగలడింది. మనమూ భరిస్తే రేపటితరం మాట్లాడటానికి కూడా అర్హత కోల్పోతారు. మౌనం కాదు, కావాల్సింది పోరాటం.. సిద్ధాంతం కాదు ఉద్యమం కావాలి. మన సమస్యకు పరిష్కారం పోరాటమే.

 

గ్రామీణ వ్యవస్థలో అందరిని ఆదరించాం… అందరిని అక్కున చేర్చుకున్నాం… పాలకులను చేశారు ప్రజలు… నమ్మి అప్పగించిన బాధ్యత కోసం సొంత ఆస్తులను కరిగించి, గ్రామాభివృద్ధి చేసిన వారు లేకపోలేదు. వ్యవసాయం కోసం ప్రభుత్వం ప్రకటించే ఏ పథకంలోనైనా… మనకు అదే అన్యాయం జరుగుతుంది. సమాజంలో కొందరు ఆస్థిపాస్తులు కూడ గట్టుకున్న రెడ్డిలను చూసి, కొందరు నాయకులను చూసి, రెడ్లు ఆర్థికంగా బాగున్నారనే భ్రమలో ఉన్నారు.

 

రెడ్డి జాగృతి నిర్వహించిన రెడ్డి భరోసా యాత్రలో మనకు కనిపించే ఈ నిజానికి ఆవలవైపు, పూటకి గతిలేక, బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేస్తూ, పట్నంలో వైద్యం కరువై ప్రాణాలు వదిలిన గాధలెన్నో, ఇదిగాక, కనీస వైద్యం కోసం సాయం కోసం, పూట తిండికి లేక చేయి చాచడానికి అభిమానం అడొచ్చి గాలిలో కలిసిన రెడ్డి బంధువుల ప్రాణాలెన్నో… సాక్ష్యాలుగా ఉన్నాయి.

 

ఇంతటి అధ్వాన్నమైన పరిస్థితులు ఎదురౌతున్నా కూడా… ప్రభుత్వం కళ్లు తెరచి సంక్షేమం కోసం ఎంతో కొంత చేస్తుంది అని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే, ఏ మాత్రం పరిస్థితులలో మార్పురాదు. మనదైన గొంతుకను దిక్కులు పిక్కటిల్లేలా చెప్పడానికి మనకంటూ ఉన్న వేదిక రెడ్డి జాగృతి… ఇది మన తరపున మాట్లాడుతుంది తప్ప మరే రాజకీయ శక్తుల మోచేతి నీళ్లు తాగి, మత్తుగా నిద్ర తూగదు. ప్రతి రెడ్డి బిడ్డ జన్మత: రెడ్డి జాగృతి సభ్యుడే… దీనికి ప్రత్యేక ప్రవేశాలు….ఏమీలేవు. ప్రతి సభ్యుడు వీఐపీయే. వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన ఎందరో యువతకు మార్గదర్శకం చేయడానికి ఇక్కడ ఉన్నారు. మనం చేయాల్సిందల్లా… వారి అనుభవాలను క్రోడీకరించు కుంటూ యువ శక్తిని మేల్కొలిపి లక్ష్యసాధన దిశగా ముందడుగులు వేయడమే. జులై 01, 2015న రెడ్డి జాగృతి ఆవిర్భావం జరిగింది. అంతకు ముందు కూడా పేదరెడ్ల సంక్షేమం కోసం ఫేస్ బుక్ వేదికగా తన బలమైన గొంతుక వినిపిస్తున్నా కూడా, పూర్తిస్థాయి రెడ్డి ఆర్గనైజేషన్ గా రెడ్డి జాగృతి తొలి అడుగులు మొదలు పెట్టి ఉధ్యమ దిశలో తనదైన ముద్రతో కొనసాగుతుంది.

 

రెడ్డి జాగృతి ఆశయాలు ప్రతి స్థాయిలో ఉన్న రెడ్డి బిడ్డల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి ఉద్దేశించబడినవి. అంతే కాకుండా చారిత్రకంగా మనం గమనించినట్లయితే, ఎందరో రెడ్డి మహోన్నతులు ఉన్నప్పటికి భవిష్యత్తు తరాలకు మన రెడ్ల చరిత్ర తక్కువగానే లభ్యం అవుతుందని చెప్పాలి. కానీ, చారిత్రక విషయాలను తెలియజేస్తూ… ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుంటూ… భవిష్యత్తును ఉజ్వలంగా మార్చడానికి బంగారు బాటలు వేసే దిశగా రెడ్డి జాగృతి ముందడుగులు వేస్తుంది. 

 

రెడ్డి జాగృతి – ఆశయాలు

 

  1. విద్యా – ఉద్యోగ అవకాశాల్లో రెడ్డి విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించాలి.
  2. రెడ్డి యువతకు స్వయం ఉపాధి – సహకార రంగాలలో ప్రభుత్వ చేయూత అందించాలి.
  3. రెడ్డి విద్యార్థులకు కూడా ప్రత్యేక గురుకులాలు – స్టడీ సర్కిళ్ళు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి.
  4. పేద రెడ్డి విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్ మెంట్ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 
  5. రెడ్డి విద్యార్థులకు ప్రవేశ పరీక్షలలో కటాఫ్ మార్కులు, వయో పరిమితి తేడాలను తగ్గించాలి. 
  6. అందరితో సమానంగా రైతు సంక్షేమం – ఆరోగ్యపథకాల సమాన వర్తింపు కలగజేయాలి. 
  7. పేద రెడ్లకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పోరేషన్ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. 
  8. వ్యవసాయాన్నే నమ్ముకున్న 60 సంవత్సరాలు నిండిన ప్రతీ రైతు బిడ్డకు “అన్నదాత” పేరుతో నెలకు 5000 రూపాయల గౌరవ పింఛను మంజూరు చేయాలి.
  9. వ్యవసాయం చేస్తున్న సమయంలో పొలంబాటలో ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వమే చెల్లించాలి.
  10. పేద రెడ్డి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు కావలసిన “ విదేశీ విద్యా నిధి ” పేరుతో ప్రభుత్వమే అందజేసి, విద్యార్థుల చదువులకు సహకరించాలి.
  11. వ్యవసాయానికి, ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి, రైతులకు వ్యవసాయానికి అనువు గాని కాలంలో ఉపాధి అందేవిధంగా చర్యలు తీసుకోవాలి.

రాజ్యాంగం… ప్రతి ఒక్కరిని సమాన హక్కులు అందించాలి. లౌకిక రాజ్యం అని గర్వంగా చెప్పుకున్న ప్రవేశికలో ఉన్న పదాలలో ఆచరణీయతలో ఉన్నప్పుడే అది ప్రజారాజ్యాంగం అవుతుంది. లేనప్పుడు అది కేవలం వర్గరాజ్యాంగంలాగానే మిగిలిపోతుంది. తరతరాలుగా అగ్రకులాల పేరిట ప్రభుత్వ పథకాలకు, రాయితీలకు దూరం చేస్తూ… కనీసం గంజికి దిక్కు లేని రెడ్లను సంక్షేమ పథకాలకు దూరం చేస్తూ… బెంజిలో తిరిగే వారికి రాయితీలు అందించి అక్కున చేర్చుకుంటే, కులం పేరుతో కాకుండా ఆర్థిక పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాలు రాయితీలు అమలు జరిగినప్పుడే సరియైన న్యాయం జరుగుతుంది.”

రెడ్డి అనేది ఒక సామాజిక బాధ్యత. పూర్వపు రోజులలో రెడ్డి గ్రామం అనే కుటుంబానికి రెడ్డి అనేవాడు పెద్దగా ఉంటూ, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా వృత్తి చేసుకుంటూ, ఎన్నో కులాలను, మతాలను మరియు వర్గాలను ఒక గొడుగు కింద చేర్చి, భిన్నత్వంలో ఏకత్వం చాటాడు.